






తేజ వార్త దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ
ఖమ్మం, అక్టోబర్ 3: నగరంలోని 8వ డివిజన్ వైఎస్సార్ నగర్ లో రూ. 580.80 లక్షలతో నిర్మించిన 91 డబుల్ బెడ్ రూం ఇళ్లు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలు కూడా ఆత్మగౌరవంతో బ్రతకాలన్నదే ప్రభుత్వ సంకల్పమని, అందుకు అనుగుణంగానే రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వమే కట్టించి, పేదలకు పంపిణీ చేస్తున్నదని అన్నారు. పైసా ఖర్చు లేకుండా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి నిరుపేదలను కొత్తింట్లోకి పంపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఏదో ఓ ఇంటికి ఇంత డబ్బు, మెటీరియల్ ఇచ్చి చేతులు దులుపుకోకుండా, ప్రభుత్వం పేదల ఆత్మగౌరవం పెంచే విధంగా ప్రభుత్వ స్థలంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం చేసి అందిస్తున్నదని అన్నారు. పూర్తి పారదర్శకంగా అర్హులైన లబ్ధదారులను ఎంపిక చేసి వారికి ఇస్తున్నామని ఆయన తెలిపారు. ఖమ్మంలో నలు దిక్కుల అభివృద్ది చేసుకున్నామని, కార్పొరేషన్ లోని ప్రతి డివిజన్ లో ప్రజలకు కావాల్సిన అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందన్నారు. వైఎస్సార్ నగర్ లోని పిల్లలకు స్కూల్ దగ్గర్లో లేనిది గుర్తించి, ఇందులోనే నూతన ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలను ఏర్పాటుచేసి ప్రారంభించు కున్నామన్నారు. విద్య, వైద్యానికి ప్రాధాన్యత నిచ్చి, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నదని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, జిల్లా విద్యాధికారి ఏ. సోమశేఖర శర్మ, ఆర్ అండ్ బి ఇఇ శ్యాం ప్రసాద్, ఖమ్మం అర్బన్ మండల విద్యాధికారి శ్రీనివాస రావు, సిఎంఓ రాజశేఖర్, ఏఎంఓ రవి, రామకృష్ణ, ఖమ్మం అర్బన్ తహసిల్దార్ సిహెచ్. స్వామి, కార్పొరేటర్ లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
—————————————-జిల్లా పౌరసంబంధాల అధికారి, ఖమ్మం కార్యాలయంచే జారీచేయనైనది.
