
గెలిపించండి …! మీ సంక్షేమం కోసం కాపు కాస్తాం…!!!
- మున్నూరు కాపు ఆత్మీయ సమావేశంలో తుమ్మల, పొంగులేటి
ఖమ్మం: మున్నూరు కాపు సంక్షేమానికి కట్టుబడి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి
పది స్థానాలను గెలిపించుకొని తద్వారా సంక్షేమ భవన నిర్మాణానికి కృషి చేస్తామని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో చైర్మన్, పాలేరు నియోజకవర్గ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఆదివారం జరిగిన మున్నూరు కాపు ఆత్మీయ సమావేశానికి వారిద్దరూ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు కుటుంబ సభ్యులనుద్దేశించి తుమ్మల, పొంగులేటి మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాల్లో మున్నూరు కాపుల పాత్ర ఆది నుండీ కీలకమని పేర్కొన్నారు. స్థానికంగా ఉండే ఒక ప్రజాప్రతినిధి మున్నూరు కాపు వర్గానికి చెందిన ఒక ముఖ్యనేతను పలుమార్లు ఇబ్బందులకు గురిచేసి పైశాచిక ఆనందం పొందారని, ప్రస్తుత తరుణంలో పెత్తందారీ వ్యవస్థకు ఆజ్యం పోస్తున్న సదరు ప్రజాప్రతినిధికి తగిన బుద్ధి చెప్పే అవకాశాన్ని కాపు సోదరులు వినియోగించుకోవాలని కోరారు. అత్యంత ప్రాభల్యం కలిగిన మున్నూరు కాపులు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పది నియోజకవర్గాల అభ్యర్థుల గెలుపుకు కృషి చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చాక మేలును మర్చిపోమని, తప్పకుండా కాపుల రుణం తీర్చుకుంటామన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి, తుమ్మల సమక్షంలో మున్నూరు కాపు నాయకుడు రాపర్తి రంగారావు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, యడవల్లి కృష్ణ, శెట్టి రంగారావు, కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు జావెద్, బాలసాని లక్ష్మీనారాయణ, మద్దినేని బేబి స్వర్ణ కుమారితో పాటు మున్నూరు కాపు వర్గానికి చెందిన నాయకులు నరాల నరేష్ మోహన్ నాయుడు, కొత్త సీతారాములు, పసుపులేటి దేవెందర్, సముద్రాల శ్రీనివాసరావు, గంగిశెట్టి శ్రీను, తాళ్లూరి హనుమంతరావు, సంపటం నరసింహారావు, కల్లూరి సోమనాథం, పగడాల మంజుల, ప్రసన్న, పలువురు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
