- లోక్ సభ బడ్జెట్ సమావేశాల్లో కోరిన ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి
ఖమ్మం: రాష్ట్రంలో నిర్వహణలో హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఒక్కటే ఉందని, మూడు కొత్తగా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, మూడు బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయాలు నిర్మించాల్సిన అవసరం ఉందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కోరారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం కాగా.. ఎంపీ ఈ మేరకు మాట్లాడారు. భద్రాద్రి కొత్తగూడెం, జక్రాన్ పల్లి నిజామాబాద్ జిల్లా, మహబూబాబాద్ జిల్లాల్లో నిర్మించాల్సి ఉందని తెలిపారు. బ్రౌన్ ఫీల్డ్ కు సంబంధించి మామునూరు- వరంగల్ అర్బన్ జిల్లా, బాసత్ నగర్ పెద్దపల్లి జిల్లా, ఆదిలాబాద్ జిల్లాలో వినియోగంలోకి తేవాలని కోరారు. హైదరాబాద్ నుంచి ఎక్కువ దూరంలో ఉన్న జిల్లాల కోసం కొత్త ఎయిర్ పోర్టులు నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతో ఉందని గుర్తు చేశారు. ఎయిర్ పోర్టు అథారిటీ గతంలోనే భూ పటిష్టత, సాంకేతిక, ఇతర సర్వేలన్నీ పూర్తి చేసి.. ఆమోదం తెలిపిందని ఎంపీ రఘురాం రెడ్డి అన్నారు. పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు స్పందించి వీలైనంత త్వరలో తెలంగాణలో ఎయిర్పోర్టుల నిర్మాణం చేపట్టాలని, కనీసం రెండు వరకు పూర్తి చేయాలని ఈ సందర్భం గా ఎంపీ రఘురాంరెడ్డి కోరారు.

