ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు నవంబర్ 25

విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలి…. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

విద్యార్ధుల నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం

పదవతరగతి ప్రాక్టీస్ పరీక్షలు రాయడం వల్ల ఒత్తిడి దూరం అవుతుంది

మధిరలోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకులంలో విద్యార్దులతో కలిసి మధ్యాహ్న బోజనం చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, నవంబర్ -25

ప్రభుత్వ విద్యా సంస్ధలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, మంచి ఆరోగ్యం ఉంటేనే పిల్లలు చదువు మీద శ్రద్ధ చూపెడతారని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు.

మంగళవారం మధిర నియోజకవర్గం లో జిల్లా కలెక్టర్ పర్యటించారు. మధిర మండలంలోని క్రిష్టాపురంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలుర గురుకులం ను కలెక్టర్ సందర్శించారు. పరిసరాలను తిరుగుతూ, పడకగదులు, బాత్ రూంలు, త్రాగునీరు, వంటగదులను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మధ్యాహ్న భోజనం చేశారు. భోజనం ఏలా ఉంటుంది, రుచిగా కూరలు పెడుతున్నారా, మెనూ ప్రకారం భోజనం, గుడ్డు, చికెన్ కర్రీ వడ్డిస్తున్నారా, పప్పు, సాంబారు నాణ్యంగా ఉంటున్నాయా అని కలెక్టర్ భోజనం చేస్తూ, విద్యార్దులను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పదవ తరగతి గదిలో విద్యార్దులకు పరీక్షలకు సంసిద్ధంగా ఉండేందుకు పలు సూచనలు చేశారు.

అనంతరం మునగాల కృష్ణాపురంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించి, ఎవ్రీ చైల్డ్ రీడ్స్ కార్యక్రమం అమలును జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టిక, రుచికరమైన ఆహారం అందించాలని, నాణ్యతలో ఏలాంటి లోపం ఉండవద్దని అన్నారు. గురుకుల పాఠశాలలో అందించే ఆహారంతో మంచి ఆరోగ్యంతో విద్యార్ధులు చదువు పై దృష్టి పెడతారని వివరించారు.

మనకు లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధ్యం అవుతాయని అన్నారు.

10వ తరగతి మెయిన్ పరీక్షల కంటే ముందు వీలైనంత మేర అధిక సంఖ్యలో ప్రీ ఫైనల్ పరీక్షలు రాయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్షలు అధికంగా రాయడం వల్ల తుది పరీక్షలను ఎటువంటి ఒత్తిడి లేకుండా సులభంగా రాయగలుగుతామని అన్నారు. మనం చదివిన దానికంటే రాసిన అంశాలు అధికంగా గుర్తుండిపోతాయని కలెక్టర్ తెలిపారు.

విద్యార్థుల చదివే సామర్థ్యం పెంపు చేయడం కోసం చేపట్టిన ఎవ్రీ చైల్డ్ రీడ్స్ ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్దపెట్టి భోదన చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జడ్పీసీఇవో దీక్షా రైనా, మధిర తహసీల్దారు రాంబాబు, హెడ్ మాస్టర్ రాములు, సైదులు, టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed