వి ఎన్ బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
బీఆర్ఎస్ లో లేరనే మువ్వా పై కక్ష సాధింపు చర్యలు
– రైతుల కోసం చేసిన సంక్షేమ కార్యక్రమాలన్నింటిలోనూ అక్రమాలు జరిగాయని తప్పుడు కేసులు బనాయింపు
– కోర్టుల నుంచి స్టే వచ్చినా ఇంకో రకమైన తప్పుడు కేసుల్లో ఇరికించాలనే ధోరణి
– తీరు మార్చుకోకపోతే రాబోవు రోజుల్లో పరాభవం తప్పదు
– 123వ మహాజన సభలో ప్రస్తుత ఛైర్మన్, ప్రభుత్వానికి డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య హెచ్చరిక
ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీలో లేరనే దురుదేశ్యంతో మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయబాబు పై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య పేర్కొన్నారు. డీసీసీబీ 123వ మహాజన సభ సందర్భంగా శుక్రవారం ఖమ్మం నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే…. 2005 నుంచి డీసీసీబీ పాలకవర్గంలో పనిచేస్తూ వస్తున్నాను. కానీ 2020 ఫిబ్రవరిలో ఏర్పాటు అయిన ప్రస్తుత పాలవర్గ పని తీరు బ్యాంకుల ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ఉంది. 2013 నుంచి 2018 వరకు డీసీసీబీ చైర్మన్ గా మువ్వా విజయబాబు కొనసాగిన సమయంలో నేను కూడా డైరెక్టర్ గా ఉన్నాను. అప్పుడు జరిగిన అన్ని నిర్ణయాలు బోర్డు యొక్క ఆమోదంతోనే జరిగాయి. ఆ సమయంలో నూతన బ్యాంకులను ఏర్పాటు చేయడం, డిపాజిట్లను రెట్టింపు చేయించడం, రైతులకు సహాయకారిగా ఉండాలనే సద్దుదేశ్యంతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేయడం, చనిపోయిన రైతు కుటుంబానికి తక్షణ సాయంగా రూ.10వేలను అందజేయడం, అతి తక్కువ ఖర్చులో వైద్యం అందించాలనే ఉద్దేశ్యంతో రైతుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రి నిర్మించడం లాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. కానీ వీటన్నింటిని పక్కనబెట్టి కొంతమందికి అక్రమ పద్దతిలో రుణాలివ్వడం జరిగిందని పేర్కొంటూ మువ్వా పై అక్రమ కేసులు పెట్టారు. వాస్తవానికి బోర్డు పాలసీలను మాత్రమే నిర్ణయిస్తుంది. ఆ పాలసీలకు అనుగుణంగా అధికారులు, సిబ్బంది పనిచేయాల్సి ఉంటుంది. 21 మంది అక్రమంగా రుణాలు పొందిన మాట వాస్తవేమే అయినప్పటికీ అందులో ఛైర్మన్ తప్పిదం కానీ పాలకవర్గం తప్పిదం కానీ ఏమి ఉండదు. కేవలం బ్యాంకు డాక్యుమెంట్లు, షూరిటీలు తదితర అంశాలను పరిశీలించి రుణాలు మంజూరు చేయడంలో కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ వారు చేసిన తప్పిదాన్ని కూడా మువ్వా పై నెట్టే ప్రయత్నం చేస్తూ కేసులు పెట్టారు. ఈ నేపథ్యంలో చట్ట ప్రకారంగా మువ్వా కోర్టు కు వెళ్లి స్టే పొందడం జరిగింది. అయినప్పటికీ ఇంకో రకమైన తప్పుడు కేసుల్లో ఇరికించాలనే ధోరణితో కేసును సీఐడీకి బదిలీ చేశారు. నూతన బ్రాంచీల ఏర్పాటు, గోద్రెజ్ కంపెనీ లాకర్లు ఏర్పాటు చేయడం, కాలానికనుగుణంగా కంప్యూటరైజేషన్ తో బ్యాంకులను అభివృద్ధి పథంలో నిబంధనల ప్రకారమే తీసుకువెళ్లినా వీటిల్లోనూ తప్పిదాలు జరిగాయని పేర్కొంటూ అస్సలు సంబంధమే లేని వ్యక్తులను ఇందులో భాగస్వామ్యులను చేసి వారి ద్వారా మువ్వా పై తప్పుడు కేసులు పెట్టించి అరెస్ట్ చేయించే ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. వాస్తవానికి బ్యాంకుకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగిన దానికి బోర్డు ఆమోదం ఉంటుంది. దాంతో పాటు ప్రతి సంవత్సరం ఆడిట్ కూడా ఉంటుంది. కానీ అవేమి పట్టనట్లుగా తమ ప్రభుత్వానికి మేమంతా వ్యతిరేకంగా ఉన్నామనే దురుదేశ్యంతో మువ్వా పై అక్రమ కేసులను బనాయించి అరెస్ట్ చేయించే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా నాన్ అగ్రికల్చర్ నుంచి డైరెక్టర్ గా కొనసాగుతున్న మేకల మల్లిబాబు యాదవ్ కు అన్ని అర్హతలు ఉన్నప్పటికి అనర్హత వేటు వేస్తూ నోటీసులు జారీచేయడం ఎంతవరకు సమంజసం. ఇందుకు సంబంధించి కూడా ట్రిబ్యునల్ కు వెళ్లి స్టే తీసుకోవడం జరిగింది. రిజర్వు బ్యాంకు నిబంధనల మేరకు కొనసాగుతున్న డీసీసీబీ బ్యాంకు ప్రతిష్ట రాష్ట్ర ప్రభుత్వం అనైతిక చర్యల వల్ల దిగజారుతుంది. ఇప్పటికే ఈ బ్యాంకు ద్వారా జిల్లాలో లక్షా 30వేల మందికి పైగా రుణాలు పొంది ఉన్నారు. రూ.1100కోట్లకు పైగా డిపాజిట్ చేయబడి ఉంది. కానీ ప్రస్తుత ఛైర్మన్, ప్రభుత్వ చర్యల వల్ల బ్యాంకు ప్రతిష్ట దిగజారే అవకాశం ఉంది. డిపాజిట్లు కూడా కోల్పోయే అవకాశం ఉంది. ఈ రకమైన ధోరణిని మానుకోకపోతే రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తుంది. దానిని ఆసరాగా చేసుకుని మీ పైన కూడా ఇదే రకమైన ధోరణిని మేమూ అవలంభించవల్సి వస్తుందని ప్రస్తుత ఛైర్మన్, రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తుళ్లూరి బ్రహ్మయ్య తన ప్రసంగాన్ని ముగించారు.

