మద్దతు ధర చెల్లింపులో రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు …. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

మద్దతు ధరపై రైతులకు అవగాహన కల్పించాలి

ప్రైవేటు వ్యాపారులకు నోటీసులు జారీ చేసి లైసెన్స్ రద్దు చేయాలి

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

ఖమ్మం,నవంబర్ -12: విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు

రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని, పత్తి పంటకు మద్దతు ధర కంటే తక్కువ చెల్లించే చర్యలను సహించేది లేదని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

మంగళవారం జిల్లా కలెక్టర్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డును ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా పత్తిని రైతుల వద్ద నుండి మద్దతు ధర కంటే తక్కువగా చెల్లించి కొనుగోలు చేసినట్లు తెలిసి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

వ్యవసాయ మార్కెట్ యార్డులో పత్తి పంటకు లభిస్తున్న ధర మొదలగు వివరాలను కలెక్టర్ రైతుల నుంచి అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, మార్కెట్ లో పత్తి పంట తేమ శాతం పరిశీలించకుండా కొనుగోలు చేయరాదని, ఇది నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. పత్తి పంట తేమ శాతం పరిశీలించి 12 శాతం వరకు ఉంటే మద్దతు ధర చెల్లించాలని తెలిపారు.

తేమ శాతం పరిశీలించకుండా రైతుల వద్ద నుంచి తక్కువ ధరకు పత్తి పంట కొనుగోలు చేయడం దారుణమని, దీనిని అరికట్టేందుకు మార్కెటింగ్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, మద్దతు ధర కంటే తక్కువకు పంట కొనుగోలు చేసేందుకు వీలులేదని కలెక్టర్ స్పష్టం చేశారు.

నిబంధనలను పరిశీలించకుండా రైతులను మోసం చేస్తూ కొనుగోలు చేయడాన్ని కలెక్టర్ తీవ్రంగా తప్పుపట్టారు. రైతులకు మద్దతు ధరపై అవగాహన కల్పించాలని, ఒక రెండు రోజులు ఆరబెట్టుకొని వస్తే మద్దతు ధర లభిస్తుందని తెలిపాలని, లేదా పంట ఇప్పుడే అమ్మాలంటే నిబంధనల ప్రకారం ధర చెల్లించాలని, ఇష్టానుసారం తేమ శాతం పరిశీలించకుండా కొనుగోలు చేయడానికి వీలు లేదని కలెక్టర్ వ్యాపారులను హెచ్చరించారు.

మార్కెట్ యార్డులో ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ప్రతి పంట ప్రక్రియను మార్కెటింగ్ అధికారులు నిరంతరం పరిశీలించాలని, రైతులకు మద్దతు ధర లభించేలా చూడాలని, తేమ శాతం దానికి అనుగుణంగా ఉండే ధర వివరాలను రైతులకు తెలియజేయాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారులకు ఆదేశించారు.

రైతులను మోసం చేస్తూ తక్కువ ధరకు పంట కొనుగోలు చేసిన ప్రైవేట్ వ్యాపారులకు నోటీసులు జారీ చేయాలని, తేమ శాతం ప్రకారం రైతులకు ధర చెల్లించని పక్షంలో లైసెన్స్ రద్దు చేయాలని కలెక్టర్ మార్కెటింగ్ అధికారిని ఆదేశించారు.

మార్కెట్ యార్డులో అవసరమైతే అదనంగా పది మంది సిబ్బందిని తేమ శాతం పరిశీలనకు విధులలో చేర్చుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా మార్కెటింగ్ అధికారి ఎం.ఏ. అలీం, మార్కెట్ అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed