🔸 ఉమ్మడి ఖమ్మం జిల్లా, పాల్వంచ లో పథకాల అమలుపై జరిగినటువంటి మంత్రుల సమీక్ష సమావేశం లో పాల్గొన్న TGIDC చైర్మన్ మువ్వా విజయబాబు.
భద్రాది జిల్లా విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు
ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతిపై ఈరోజు పాల్వంచలోని ఐడిఓసి భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క , రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి , వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు , ఇన్‌చార్జి మంత్రి వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు రామసహాయం రఘురాం రెడ్డి , పోరిక బలరాం నాయక్ , ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేక అధికారి సురేంద్ర మోహన్ , జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
సమావేశంలో జిల్లాలో కురుస్తున్న వర్షాల పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, రైతులకు ఎరువుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, అభివృద్ధి పనుల నాణ్యత, రేషన్ కార్డుల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరుపై సమగ్రంగా చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.. గతేడాది మాదిరిగా ముంపు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక నివాస శిబిరాలను సిద్ధం చేయాలని సూచించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థల పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధుల నియంత్రణకు వైద్య శాఖ ముందుగానే సన్నద్ధంగా ఉండాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఔషధాలు, వైద్య సిబ్బంది, అవసరమైన సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, ఇసుక సరఫరాలో ఆటంకాలు లేకుండా చూడాలని సూచించారు. అభివృద్ధి పనులు నాణ్యతతో పాటు నిర్దేశిత గడువుల్లో పూర్తి కావాలని, రైతులకు ఎరువుల కొరత తలెత్తకుండా వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరపాలని మంత్రి అన్నారు. ప్రజల జీవితాల్లో సంక్షేమ పథకాల ప్రభావం స్పష్టంగా కనిపించేలా చూడాలని, అధికారులు ఫీల్డ్‌లో ఉండి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా గమనించి తక్షణ స్పందన ఇవ్వాలని ఆయన ఆదేశించారు. అభివృద్ధి అనేది కేవలం కాగితాల మీద కాకుండా కంటికి కనిపించేలా ఉండాలన్నారు. ప్రతి కుటుంబం భద్రతగా, అభివృద్ధి దిశగా ముందుకు సాగేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని చెప్పారు.