పోరాడితేనే ఇళ్లు.. స్థలాలు

,* కేంద్ర, రాష్ట్రాలు ఇంటి నిర్మాణానికి రూ.15 లక్షలు ఇవ్వాలి

  • పేదలకు జాగా ఇవ్వరు..కార్పొరేట్లకు వేల ఎకరాలా..?
  • ఎర్రజెండా పోరాట ఫలితమే ఖమ్మం చుట్టు పక్కల నగర్ లు
  • ఇళ్ల స్థలాల కోసం ధర్నాలో రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని, నాయకులు నున్నా
  • ప్రభుత్వ ఆదేశాల‌ మేరకు ఇళ్లస్థలాలు ఇస్తాం: శైలజ, ఖమ్మం అర్బన్ తహశీల్దారు

నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి:
పోరాడితేనే ఇళ్ల స్థలాలు వస్తాయని రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు అన్నారు. ఎర్రజెండాల పోరాట ఫలితంగానే ఖమ్మం చుట్టుపక్కల కొత్త నగర్ లు ఏర్పాటయ్యాయి అన్నారు. 2022 నాటికి దేశంలో ఇల్లు లేని పేదలు లేకుండా చేస్తామన్న కేంద్రం ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక్కరికి కూడా ఇల్లు కట్టించింది లేదన్నారు.‌ సీపీఐ (ఎం) ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలు రకాల డిమాండ్ ల సాధనకు నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి వారు మాట్లాడారు. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు రాష్ట్రం, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కేంద్రం రూ.10 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2006లో ఇదే స్థలంలో పెద్ద పోరాటం చేసిన ఫలితంగానే ఇళ్ల స్థలాలు వచ్చాయన్నారు. ఇళ్లు లేని వారికి స్థలాలు ఇవ్వాలంటూ ఎనిమిది రోజులపాటు పోరాడిన ఫలితంగానే సర్వే చేసి 6800 మందిని అర్హులుగా నిర్ధారించినట్లు తెలిపారు. వివిధ రూపాల్లో ఆందోళనలు, జిల్లా దిగ్బంధం తదితర కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు.‌ ఫలితంగానే వీరిలో కొంతమందికి ఇళ్ల స్థలాలు లభించాయని చెప్పారు.‌ ఖమ్మంలోని వైయస్సార్ నగర్, కెసిఆర్ నగర్, ఉదయ్ కుమార్ నగర్, రమణ గుట్ట, వికలాంగుల కాలనీ… ఇలా ఎన్నో నగర్ లు ఎర్ర జెండాల పోరాట ఫలితంగా ఆవిర్భవించాయన్నారు. కార్పొరేట్లు పది ఎకరాలు అడిగితే 15 ఎకరాలు ఇస్తున్న ప్రభుత్వాలు నిరుపేదలకు 125 గజాల ఇళ్ల స్థలం ఇవ్వడానికి వెనకాడుతున్నాయని ధ్వజమెత్తారు.‌ 9 ఏళ్లలో ఎనిమిది వేల మందికి డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామన్న కెసిఆర్ ప్రభుత్వం కేవలం 2000 మందికి మాత్రమే రెండు పడకల గదులు ఇచ్చిందన్నారు. గృహ లక్ష్మీ పథకం కింద సొంత స్థలం ఉన్న వారికి రూ. ఐదు లక్షల చొప్పున ఇస్తామన్న ప్రభుత్వం దానిని రూ.3 లక్షలకు కుదించిందని తెలిపారు. దానిని యథావిధిగా రూ.5 లక్షలుకు పెంచాలని, కేంద్రప్రభుత్వం మరో రూ.10 లక్షలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇవ్వాలని డిమాండ్ చేశారు. రోడ్లు, లైట్లు అభివృద్ధిలో భాగం కావచ్చు కానీ ప్రతి మనిషి కనీస అవసరాలు తీర్చితేనే నిజమైన అభివృద్ధి అని పేర్కొన్నారు. అర్హులకు రేషన్ కార్డులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. రెండువేల పెన్షన్ ను రూ.3 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. 57 సంవత్సరాలు నిండిన వారికి వెంటనే పెన్షన్ ఇవ్వాలని కోరారు.‌ అనంతరం డిమాండ్ల తో కూడిన వినతిపత్రం, ఇళ్ల స్థలాలు, వివిధ సమస్యల దరఖాస్తులను తహశీల్దారు శైలజకు ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు ధర్నా వేదిక వద్ద అందజేశారు.

  • ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు: తహశీల్దారు శైలజ
    ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలు ఇస్తామని ఖమ్మం అర్బన్ తహశీల్దారు శైలజ హామీ ఇచ్చారు. ధర్నాస్థలి వద్దకు వచ్చి దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడారు. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం సైట్ క్లోజ్ అయి ఉందని, మీ సేవలో అప్లై చేసుకుంటే సైట్ ఓపెన్ అయ్యాక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హులకు కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల అంశం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని నివసిస్తున్న పేదలకు 58 జీవో కింద క్రమబద్ధీకరిస్తూ పట్టాలు జారీ చేశామని తెలిపారు. 2014 జూన్ లోపు ఆక్రమించుకొని నివసిస్తున్న వారికి మొదట్లో పట్టాలిచ్చామని, 2020 వరకు ఇవ్వాలని దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటినీ పై అధికారులకు పంపుతామన్నారు. వారి ఆదేశాల మేరకు పని చేస్తామన్నారు.
    సిఐటియు రాష్ట్ర నాయకులు యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన జరిగిన ఈ ధర్నాలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాది నేని రమేష్, బొంతు రాంబాబు, ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి, తెలంగాణ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి భూక్యా వీరభద్రం, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు వై. విక్రమ్, నాయకులు యర్రా శ్రీనివాస్, నవీన్ రెడ్డి, మేకల సంగయ్య, రమ్య, భూక్యా శ్రీనివాస్, ఎంఏ జబ్బార్, బోడపట్ల సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకొని ఖమ్మం నియోజకవర్గంలోని 3 టౌన్ ప్రాంతం నయాబజార్ స్కూల్లో నిర్వహించిన ఇఫ్తార్ ఏ దావత్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యువ నాయకుడు తుమ్మల యుగంధర్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ మాసం పురస్కరించుకొని అత్యంత భక్తిశ్రద్ధలతో కటోర ఉపవాస దీక్షతో కఠిన నియమ నిబంధనలతో దీక్ష చేసే ముస్లిం సోదర సోదరీమణులను కలుసుకొని వారి సమక్షంలో ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా ఆనందంగా ఉన్నదని , ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించాలని అన్నారు. 2000 మంది ఒకేసారి ఈ ఇఫ్తార్ విందులో పాల్గొనడం చాలా గొప్ప విషయమని ఏర్పాట్లు చాలా బాగా చేశారని అన్నారు ఈ కార్యక్రమంలో ఖమ్మం కార్పొరేషన్ డిసిసి అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి, నగర మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తల్లాడ రమేష్ 3 టౌన్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎర్రం బాలగంగాధర్ తిలక్ నున్న మాధవరావు గారు కల్వకుంట్ల గోపాల్ గారు మొహమ్మద్ అష్రఫ్ ముక్తార్ నగర ఓబీసీ,intuc sc సెల్ అధ్యక్షులు బాణాల లక్ష్మణ్, నరాల నరేష్ శంకర్ నాయక్ నాలం సతీష్ ధనాల రమణ బొమ్మ ఉదయ్ వెన్న పండు కుదుమూరి ఉమేష్ పత్తికొండ శ్రీనివాస్ అల్లే సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు