*ఖమ్మం విఎన్బి న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ వెంపటి నాయుడు ఆగస్టు 26*
ఉపాధి అవకాశాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని మహిళలు అర్ధికంగా ఎదగాలి… జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
మహిళలు నైపుణ్యంతో లాభసాటి వ్యాపారాలను ప్రారంభించాలి
వృత్తి విద్యా కోర్సులు, ఉపాధి శిక్షణలు అందిస్తున్న మహిళా ప్రాంగణం సేవలు అభినందనీయం
టేకులపల్లిలోని మహిళ ప్రాంగణం ను సందర్శించి, టైలరింగ్, కంప్యూటర్, మల్టీఫర్పస్ హెల్త్ వర్కర్స్ , డ్రోన్ పైలెట్ శిక్షణ ప్రకియ విధానాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్













మహిళలు లాభసాటి వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా బలోపేతం కావాలని, మరొకరికి ఉపాధి కల్పించే విధంగా అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. మంగళవారం ఖమ్మం నగరం టేకులపల్లి లోని దుర్గాబాయి మహిళా, శిశు వికాస కేంద్రం మహిళా ప్రాంగణంను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సందర్శించారు.
మహిళా ప్రాంగణం పరిసరాలను కలియ తిరిగిన కలెక్టర్, ప్రాంగణానికి కావలసిన మౌళిక సదుపాయాల గురించి మహిళా ప్రాంగణం మేనేజర్ ను అడిగి తెలుసుకున్నారు. మహిళలకు అందిస్తున్న వృత్తి విద్యా కోర్సులు, ఉపాధి శిక్షణ టైలరింగ్, మల్టీఫర్పస్ హెల్త్ వర్కర్స్ శిక్షణ, ఏఎన్ఎం నర్సింగ్, స్పోకెన్ ఇంగ్లీష్, టైపింగ్, ట్యాలీ, అకౌంటింగ్, కంప్యూటర్, డీసీఏ, డీటీపీ, డ్రైవింగ్, బ్యూటిషీయన్, మగ్గం వర్క్క్, తదితర కోర్సులు, టీచింగ్ రూమ్స్, వసతి గృహం, డైనింగ్ హాల్ లను పరిశీలించారు.
గ్రామీణ ప్రాంత మహిళలకు వ్యవసాయ రంగంలో వినూత్న పద్దతుల ద్వారా అధిక ఆదాయం సాధించేందుకు, స్వయం ఉపాధికి అందిస్తున్న డ్రోన్ శిక్షణను కలెక్టర్ పరిశీలించారు. డ్రోన్ పైలెట్ శిక్షణ వివరాలను మహిళలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ 2047 నాటికి దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తయ్యే నేపథ్యంలో మన తెలంగాణ రాష్ట్రం ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఎదిగి దేశాభివృద్ధికి మనం తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ 2047 పాలసీతో ప్రభుత్వం ముందుకు వెళుతుందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మహిళల వర్క్ ఫోర్స్ పెరగడం చాలా కీలకమని అన్నారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను భాగస్వామ్యం చేయడం వల్ల ప్రగతి చాలా రెట్లు పెరుగుతుందని అన్నారు. వ్యాపారవేత్తలుగా మహిళలు ఎదిగితే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు.
వయస్సుతో సంబంధం లేకుండా శిక్షణ తీసుకుంటున్న మహిళలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. నర్సింగ్, కంప్యూటర్ విద్య, టైలరింగ్‌లో శిక్షణ పొందుతున్న మహిళలతో పలు అంశాలు చర్చించానని, ఇక్కడ డ్రోన్ వాడకంపై కూడా శిక్షణ అందించడం అభినందనీయమని అన్నారు.
వ్యవసాయ రంగం ఖమ్మం జిల్లా ఆర్థిక వ్యవస్థకు కీలకమని, 6 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, సంవత్సరానికి సరాసరి 10 లక్షల ఎకరాలు సాగు అవుతాయని అన్నారు. ప్రస్తుతం రైతులకు కూలీలు దొరకడం లేదని, వ్యవసాయ రంగం యాంత్రికరణ వైపు వెళుతూందని, డ్రోన్ వినియోగిస్తే ఒక ఎకరం భూమిలో పురుగు మందు పిచికారీ 15 నిమిషాల్లో చల్లవచ్చని అన్నారు.
ప్రస్తుతం డ్రోన్ ద్వారా మందులు పిచ్చికారీ చేయడానికి ఎకరానికి 500 రూపాయల వసూలు చేస్తే మన జిల్లాలో సంవత్సరానికి 150 కోట్ల వరకు గరిష్టంగా వ్యాపార అవకాశాలు అందుబాటులో ఉన్నాయని అన్నారు. డ్రోన్ వాడకం వల్ల ఒక రోజు దాదాపు 15 వేల వరకు సంపాదించవచ్చని, నెలలో 20 రోజులు పని చేస్తే కలెక్టర్ కంటే 3 రెట్లు ఎక్కువ సంపాదించవచ్చని అన్నారు.
నానో యూరియా వాడకం డ్రోన్ ద్వారా సాధ్యం అవుతుందని, రాబోయే రోజుల్లో డ్రోన్ వినియోగం పెరుగుతుందని అన్నారు. టీవి, సెల్ ఫోన్ లాగా డ్రోన్ కూడా రాబోయే రోజుల్లో సర్వ సాధారణం అవుతుందని అన్నారు. డ్రోన్ శిక్షణ తర్వాత అభ్యర్థులు తాము ఉపాధి పొందుతూ భవిష్యత్తులో మరొకరికి ఉపాధి అందించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
వ్యాపార రంగంలో లాభార్జనే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని, కస్టమర్లలో నమ్మకం కలిగించాలని, వ్యాపారం చేసే సమయంలో మనకు దానిపై సంపూర్ణ అవగాహన ఉండాలని, ఆ దిశగా మన నైపుణ్యతను పెంచుకోవాలని కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మహిళా ప్రాంగణం మేనేజర్ వేల్పుల విజేత, సిబ్బంది సరస్వతి, స్పందన, మల్లిక, విజయ్ కుమార్, సుధీర్, సుకన్య, మౌనిక, లాలయ్య, జయ, శారద, అనిత, దుర్గారావు, శాంతమ్మ, కళ్యాణి తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మంచే జారీ చేయనైనది.








