మన జ్యోతి దినపత్రిక తెలంగాణ ఖమ్మం సిటీ

ఖమ్మం బ్యూరో వెంపటి నాయుడు మన జ్యోతి

ఖమ్మం, జనవరి 5: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ప్రజాపాలన దరఖాస్తులను కట్టుదిట్టంగా, ఎలాంటి పొరపాట్లు లేకుండా ఆన్ లైన్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్, స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో ప్రజా పాలన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసే అంశంపై డేటా ఎంట్రీ ఆపరేటర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాపాలన కార్యక్రమం ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక పోర్టల్ రూపోందించిందని, మండలాల వారీగా వచ్చిన దరఖాస్తులను డేటా ఎంట్రీ ఆపరేటర్ లు ఆన్ లైన్ ప్రజాపాలన వెబ్ సైట్ లో నమోదు చేయాలని తెలిపారు. ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ప్రజాపాలన కార్యక్రమానికి వచ్చి తమ దరఖాస్తులు సమర్పించారని, అర్హులైన ప్రజలకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు సదరు దరఖాస్తులను ఆన్ లైన్ లో నమోదు చేయడం చాలా కీలకమని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు దరఖాస్తుదారుల వివరాలను ఎలాంటి చిన్న పొరపాటు కూడా లేకుండా ఆన్లైన్లో భద్రపరచాలని కలెక్టర్ అన్నారు. ప్రజాపాలన వెబ్ సైట్ లో డేటా ఎంట్రీ ఆపరేటర్ లకు లాగిన్ అందిస్తామని, మండలాలలో అవసరమైన మేర కంప్యూటర్లు, వేగవంతమైన అంతర్జాలం మొదలగు ఏర్పాట్లు చేశామని, వెంటనే దరఖాస్తులు ఆన్లైన్ లో నమోదు చేయడం ప్రారంభించి ప్రభుత్వం నిర్దేశించిన జనవరి 17 గడువు ఉన్నప్పటికీ, మన జిల్లాలో వచ్చిన ప్రజా పాలన దరఖాస్తులను పూర్తిస్థాయిలో సంక్రాంతి లోపు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆయన తెలిపారు. ప్రజా పాలన దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దరఖాస్తుదారుల ఆధార్ కార్డు, రేషన్ కార్డు నెంబర్, వారి కుటుంబ సభ్యుల వివరాలు, వారు దరఖాస్తు చేసుకున్న పథకాలకు సంబంధించిన వివరాలను ఎలాంటి పొరపాట్లు లేకుండా కట్టుదిట్టంగా నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ అన్నారు. ఆన్లైన్ ప్రక్రియ సూచించిన కేంద్రాలు, ఎంపిడివో, తహసీల్దార్, మునిసిపల్ కార్యాలయాలు తదితర దగ్గర మాత్రమే చేపట్టాలని ఆయన తెలిపారు. పర్యవేక్షణకు ప్రత్యేక అధికారుల నియామకం చేసినట్లు, ప్రక్రియను వారి సమక్షంలో చేపట్టాలని, సందేహాలుంటే వారితో నివృత్తి చేసుకోవాలని ఆయన అన్నారు. దరఖాస్తుల్లో ఉన్న వివరాలు నమోదు చేయాలని, యూజర్ ఐడి, లాగిన్ లు గోప్యంగా ఉంచాలని, ఇతరులకు ఇవ్వవద్దని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, డిపిఓ హరికిషన్, ఇడిఎం దుర్గాప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed