ప్యాక్స్ కేంద్రాల ద్వారా రైతులకు యూరియా సరఫరాకు చర్యలు

  • యూరియా పంపిణీలో చిన్న అవకతవకలు జరిగినా స్పాట్ లో సస్పెండ్
  • కూసుమంచి క్యాంపు కార్యాలయంలో యూరియా సరఫరాపై సమీక్షించిన మంత్రి పొంగులేటి
  • కూసుమంచి : పాలేరు నియోజకవర్గం పరిధిలో ఇక నుంచి ప్యాక్స్ కేంద్రాల ద్వారా మాత్రమే రైతులకు యూరియా సరఫరా జరగాలని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి యూరియా సరఫరాపై శుక్రవారం సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…. ఏప్రిల్ నెల నుంచి కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన స్థాయిలో యూరియా సరఫరా చేయని కారణంగా కొంత యూరియా కొరత మన రాష్ట్రంలో ఉందని అన్నారు. రామగుండం ఆర్.ఎఫ్.సి.ఎల్. ఉత్పత్తి సాంకేతిక సమస్యల వల్ల నిలిచిపోయిందని అన్నారు. ఖమ్మం జిల్లాకు రాబోయే 7 రోజులలో 1600 మెట్రిక్ టన్నుల యూరియా స్టాక్ వస్తుందని అన్నారు. పాలేరు నియోజకవర్గ పరిధిలో ప్యాక్స్ సోసైటిల ద్వారా మాత్రమే రైతులకు యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. యూరియా అక్రమ రవాణాను అరికట్టాలని అన్నారు. వ్యవసాయ శాఖ ద్వారా క్రమ పద్ధతిలో రైతులకు యూరియా పంపిణీ చేసేందుకు కార్యాచరణ అమలు చేయాలని అన్నారు. యూరియా పంపిణీలో ఎటువంటి తప్పులు జరగరాదని అన్నారు. గత సంవత్సరం కంటే ఎక్కువ యూరియా అమ్మినట్లు రిపోర్టు ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయిలో సమస్య ఉండటం ఆశ్చర్యకరంగా ఉందని అన్నారు. వ్యవసాయ సహకార సంఘాల ద్వారా యూరియా అమ్మకం యూనిట్లను పెంచాలని, సహకార శాఖ, వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ సిబ్బందిని డిప్యూటేషన్ లో తీసుకోవాలని, పోలీస్ అధికారుల సహకారం తీసుకోవాలని, రైతులకు నేరుగా యూరియా అందించేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పాలేరు నియోజకవర్గంలో ఇక నుంచి ప్రైవేటు రంగానికి యూరియా బ్యాగ్ ఇచ్చే ఆస్కారం లేదని, వ్యవసాయ సహకార సంఘాల నుంచి అదనపు సబ్ సెంటర్లు ఏర్పాటు చేసి యూరియా పంపిణీ చేయాలని, సెప్టెంబర్ సీజన్ ముగిసే వరకు యూరియా అమ్మకాలకు అనుమతిస్తూ టెంపరరీ లైసెన్సులు జారీ చేయాలని అన్నారు. యూరియా పంపిణీలో ఎవరైనా చిన్న అవకతవకలకు పాల్పడిన స్పాట్ లో సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్ కు మంత్రి స్పష్టం చేశారు. ప్రతి సబ్ సెంటర్ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. యూరియా పంపిణీ పర్యవేక్షణకు రెవెన్యూ డివిజన్ అధికారినీ నియమించాలని మంత్రి తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి డి. పుల్లయ్య, పాలేరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి రమేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed