
ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లకు కమీషన్ పెంపు
- ఒక్కో సిలిండర్ పై అదనంగా రూ. 7.23 పైసలు చెల్లింపు
- ఎంపీ వద్దిరాజు చొరవతో ఇటీవలే కేంద్ర మంత్రిని కలిసిన డీలర్లు
- నాలుగేళ్ల ఎదురు చూపులకు దక్కిన ఫలితం
- అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చిన కమీషన్ పెంపు
ఖమ్మం, అక్టోబర్, 3:
ఎల్పీజీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. గడిచిన నాలుగేళ్లుగా దేశ వ్యాప్తంగా డిస్ట్రిబ్యూటర్లు ఎదురు చూస్తున్న కమీషన్ పెంపుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో సిలిండర్ పై ఇప్పుడిస్తున్న దానికి అదనంగా రూ. 7.23 పైసలు కమీషన్ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మంగళవారం అర్ధరాత్రి నుంచే అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అన్ని గ్యాస్ కంపెనీల అధికారులకు ఆదేశాలు వెలువడ్డాయి. కమీషన్ పెంపు వల్ల ఒక్కో డిస్ట్రిబ్యూటర్ కు అదనంగా రూ. 1 లక్ష రూపాయల మేర లబ్ధి చేకూరనుంది.
ఇటీవలి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల సందర్భంగా రాజ్యసభ ఎంపీ, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్లు ఢిల్లీలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరిని కలిసి, తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఆ సందర్భంగా నాలుగేళ్లుగా డీలర్లు ఎదుర్కొంటున్న కమీషన్ సమస్యను ఎంపీ రవిచంద్ర కేంద్ర మంత్రికి వివరించారు. అంతకు ముందు ఇదే విషయాన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ రమేష్ బిధూరి దృష్టికి కూడా ఆయన పలుమార్లు తీసుకెళ్లారు. ఆ విజ్ఞప్తుల ఫలితంగానే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల సంఘం ప్రకటించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ తెలంగాణ అద్యక్షుడు కె. జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షుడు సుమన శేఖర్, మాజీ అద్యక్షుడు మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, నాగసాయి శేఖర్ లు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, డిస్ట్రిబ్యూటర్లకు మేలు చేసిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, సహకరించిన ఇతర ఎంపీలకు వారు ధన్యవాదాలు ప్రకటించారు.
