





ఐదేళ్ల భవిష్యత్తుకి 23రోజులు కష్టపడండి
- ఎన్ని పనులున్నా ఓపికచేసుకుని ఎన్నికలపై దృష్టిపెట్టండి
- నేలకొండపల్లి, కూసుమంచి బూత్ కమిటీల సమావేశాల్లో తుమ్మల, పొంగులేటి నేలకొండపల్లి / కూసుమంచి : “ఎన్నికల కురుక్షేత్రానికి ఇంకా తక్కువ రోజులే మిగిలి ఉన్నాయి… ఎన్ని పనులున్నా ఓపిక చేసుకుని ఎన్నికలపై దృష్టి పెట్టండి… ఇందిరమ్మ రాజ్యం • కోసం కృషి చేయండి… తద్వారా ఐదేళ్ల భవిష్యత్తు ఉంటుందని మేము హామీ ఇస్తున్నాం” అని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. నేలకొండపల్లి మండలంలోని సీతారామ ఫంక్షన్ హాల్లో, కూసుమంచి మండలంలోని బి.వి. రెడ్డి ఫంక్షన్ హాల్లో శనివారం కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ సభ్యుల అవగాహన సమావేశం జరిగింది. వేర్వేరు సమయాల్లో జరిగిన ఈ సమావేశాలకు తుమ్మల, పొంగులేటి ముఖ్యఅతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ పాలనలో యావత్ తెలంగాణ రాష్ట్రం తీవ్రంగా వెనుకబాటుకు గురైందని విమర్శించారు. రెండు సార్లు మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఈసారి కూడా ఓట్లు దన్నుకొని ప్రజలను మోసగించేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా ఈసారి జరగబోయే ఎన్నికల్లో డబ్బు ఎరగా చూపి ప్రజలను మభ్యపెట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. వీటన్నింటిని తిప్పికొట్టాలంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అమలుచేయబోయే ఆరు గ్యారెంటీలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని సూచించారు. దాంతో పాటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కల్పించిన సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు అవగాహన కల్పించాలని, లబ్ధి పొందిన వారి వివరాలను సేకరించి ప్రజలకు ఉదాహరణగా చూపాలని సూచించారు. ఈ 23రోజుల పాటు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. కొత్తపాత అనే తేడా లేకుండా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా నాయకులు రాయల నాగేశ్వరరావు, మానుకొండ రాధాకిషోర్ తో పాటు ఆయా మండలాల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, నూతనంగా నియమించిన బూత్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
